Tuesday, November 23, 2010

-----------------------------



తలపై నిత్యం గంగను మోసే .. నీకెందుకులే అభిషేకాలు…
అన్నపూర్ణే ఆలిగ ఉండగ.. ఎందుకు నీకు నైవేద్యాలు..
సింగారానికి ఆమడ దూరం.. నీకెందుకు పూలు..నగలు..
నిత్యం వెలిగే జ్యోతివి నువ్వు. ఎందుకు నీకు హారతి సెగలు..

------------------------------

Thursday, November 4, 2010

దీపావళి

చీకటే పారి పోవాలి..కోటి దీపాల కాంతికి
నింగే హద్దు కావాలి.. ఉరికే మనసు వేగానికి..
హద్దులే చెరిగి పోవాలి..మనిషికి మనిషికి..
లోకమే ఏకమై ..వెలుగులే నింపాలి ఈ దీపావళి

Wish U all a very colorful Diwali ...

Saturday, October 30, 2010

హృదయపు వీణను.. మృదువుగ మీటిన రాగం
రేపటి ఆశో..నిన్నటి ద్యాసో.. ఏమో తెలియదు ఈ నిమిషం
భారంగా మారింది గుండె లోతుల్లో దాగిన భావం..
మౌనంగా మిగిలింది.. మాటల కందని ఉద్వేగం..

Thursday, October 7, 2010

----------------------


కోరిన వరుడు.. తోడుగ కూడే.. ఈ శుభ సమయం
తూరుపు ఎరుపు.. నేర్పుగ దిద్దాలి.. కళ్యాణ తిలకం
పారాణి రంగై పాదాల వాలాలి.. పడమటి బానుడి అందం
రంగుల వనమై చిరకాలం..వెలగాలి.ఈ ఏడడుగుల బంధం

----------------------
---------------------------
వసంతాన్ని పిలిచే కోకిల గానం .. మీ సొంతమవ్వాలి నిత్యం..
హేమంత రాగాన మీ జంట కోసం..పొగ మంచు చేసేను నాట్యం
ఆరారు కాలాలు ఆతిద్యమిస్తూ మీ తోటి చేయాలి స్నేహం..
ఏడేడు లోకాలు ఏనాడు కనని.. సిరులకు ఆచూకి కావలి మీ బంధం

--------- Ramesh Samineedi
-------------------------

మనిషి మనుగడకు .. మేటి సంస్కృతికి.. మార్గం చూపెను..వేదాల సారం..
రాచ నీతి సూత్రాలను.. ధర్మ శాస్త్ర మర్మాలను ..విప్పి చెప్పెను భారతం..
శాంతి యుద్ధం .శక్తి చూపెను .. గాంధీ నడిపిన .. సత్యాగ్రహం...
అహింసే పరమ ధర్మమని.. చాటి చెప్పెను గౌతమ బుద్ధుని తత్త్వం..
...జాతి మెచ్చిన .. మేటి నేతల .. జగతికిచ్చెను .. మన భరత ఖండం..
శతాబ్దాలు మరువ లేని .. యుగాంతాలు చెరపలేని.. మేటి చరిత మనకు వారసత్వం.


-------------------------

Tuesday, August 10, 2010

నీ పరిచయం..

-----------


కను పాపకి నీ పరిచయం.. రేపిందే తీపి కలవరం..
నిను తాకి వచ్చిన గాలికి.. మంచి గంధపు పరిమళం
నీ చూపుల వేడికి మరిగిందే.. నా తలపుల సంద్రం..
తీపి భాదైనా ఈ మధుర భావం.. బాగుందే ఈ అనుభవం


-----------

Trip to Matheran

------------

అలుపే రాక...విడుపే లేక..వడిగా కురిసే వరుణుడి జల దారలు..
అటు ఇటు పోతూ.. అపుడపుడూ.. పలకరించే భానుడి కిరణాలు....
ఆకాశాన్ని ..భూగోళాన్ని.. ఏకం చేసే చిక్కని మబ్బుల తెరలు..
పాతాళానికి.. దారులు చూపుతు.. వయ్యారంగా సాగే జలపాతాలు...

బందించేదెలా'కెమేర' కన్నులు.. కను పాపకి అందని అందాలు
పచ్చని కొండల మధ్య.. బందీ అయిన చక్కని ప్రకృతి సిరులు..


--------

On the eve of Friendship day

--------


ఏ వరుస ఎరుగని బంధం...ఏ ముడి కలపని బంధం.
చితి వరకు నడిచే బంధం.. నీదేరా ఓ నేస్తం..

పండగై ఎదురొస్తుంది...ప్రతి రోజూ .. నీ స్నేహం...
నవ్వులే పండిస్తుంది..అన్ని వేళలా.. నీ సావాసం

కష్టం నిను కృంగ తీసినా.. చెలిమి.. చేయి తోడుంది
కాలం కారు చీకటయినా ..వెన్నెలై.. వెలుగిస్తుంది

--------

Thursday, July 22, 2010

Bandh

-----------


ఎవరి కోసం .. ఎందు కోసం .. ఈ 'బంధు' ల పర్వం..
మన నడక కి . మన ప్రగతి కి.. మనమే వేసుకునే బందనం..

ఆకలే పేద వాడి రథం.. ఆగితే కదలదే వాడి జీవితం
సగటు మనిషి ఆనందం. స్వార్థానికి బలి కోరే అరాచకీయం
ప్రజా బలాన్ని.. పక్క దారి పట్టించే.. మన రాచ కులపు కీచకీయం

కష్టమొస్తే కడుపు మంటని కంటి నీటి తో ఆర్పుకుంటాం
కోపమొస్తే కర్మ అంటూ ఓర్పు మంత్రం చదువుకుంటాం

ఒక్క సారి మంద వీడి.. కొత్త దారిని చూప టానికి భయం
ఒక్క అడుగు ముందుకేసి.. తప్పు అని చెప్పగలమా మనం


-----------

Sunday, July 11, 2010

ఏ వైపు చూడాలి నా కనులు.
ఎటు చూసినా ఎన్నెన్నో అందాలు.

సొగసుగ సాగిన తరుణుల నడకలు..
ధరణికి దింపెను దివి సిరులు.

వనితల సొగసులు.. నవనీతపు శిల్పాలు..
...యద సడి లో రేపేను ఏవో అలజడులు..

మదువుల దొరకని ఎన్నో మధురిమలు..
కల బోసిన వన్నెల కన్నుల కన్నెల చూపులు..

అవి కనుబొమ్మల విల్లులు.. సంధించిన సమ్మోహన భాణాలు
ఆ చిరునవ్వుల జల్లుతో.. మొలకెత్తెను నవ మోహన భావాలు..

Wednesday, June 16, 2010

వేదం

Inspired by five characters in "Vedam: movie


ఇది పచ్చ నోటు పై మనిషి రాసిన మరో వేదం..
ఇది బ్రతుకు బడి లో విధి నేర్పుతున్న పాఠం

భారతాన.. గీత లోన .. చెప్పినదేమో కానీ మాదవుడు
బూటకాల.. జీవితాన.. బ్రతుకుతున్నాడు మానవుడు
డబ్బు మబ్బు కమ్ముకుంటే. .డాబు లోన గడుపుతుంటే.
నిన్ను నువ్వు మరిచి పోతే.. 'అసలు నువ్వు' చచ్చి నట్లే..

వేరు వేరు పేరులున్నా, మతం పేరు వేరు అయినా.. మనుసులంతా ఒక్కటే..
ముసుగు రంగు ఏది అయినా.. వెతికి చూస్తే.. వెనక ఉన్నది మనిషే..
ఏ దారిని నువు వెతుకుతున్నా.. గమ్యమొక్కటే.. ఆ దారి పేరే మతమంటే..
ఏ పేరు తో పిలుచుకున్నా.. ఏ రూపు తో నువు కొలుచుకున్నా.. దేవుడొక్కడే

ఆశ శ్వాసై ..ఆయువయ్యే...చీకటైన పేద వాడి.. బ్రతుకు బండికి..
ఆశయాల దీపమే దారి చూపే .. చదువు వెలుగు లో.. వాడి భవితకి
అందమైన ఆ రేపు కోసం.. అవయవాలే.. పెట్టు బడి.. ఆ కన్న తల్లికి..
ఆహుతయ్యే జీవితాలే సమిధలయ్యే..కన్న కొడుకు కళ్ళ లో కాంతి నింపటానికి.

పంజరాన ఉండ లేక .. మరో లోకం చేరుకోగా.. మాయ తెలియని ఓ మగువ
కారడవిని కోరి చేరి.. క్రూర మృగాల చేత చిక్కే.. ఆ రంగు రంగుల రా చిలక

స్వార్థం అద్దం చూపే లోకం.. ఎవరికీ ఎవరూ ఏమీ కాని బొమ్మల కొలువు..
ఆ సంకెల విడిచి .. సత్యం చూడు .. అందరి లోను ఉన్నదీ నువ్వు..

బ్రతుకు పయనం చేర్చు గమ్యం తెలుసా నీకు..వెళ్ళే దారిని వెతకటమే మనకి తెలుసు
ఇలపై ఇది ఉమ్మడి మజిలీ మనకు.. ఆ దారిని నువు ఎపుడూ ఒంటరి కాకు..

Sunday, May 9, 2010

మనిషి

ఏం సాధిద్దామని.. ఈ వృధా పోరాటం..
మరిచామా మనం .. చరిత్ర నేర్పిన పాఠం
గుర్తుంటే మనకి, కాలం చేసిన గాయం..
జరిగేనా..మతాల మాటున మారణ హొమం..

మనిషి మనిషి గా మనలేకుంటే..
మనిషికి మనిషే శత్రువు అయితే..
మనలో మనకే వైరం పుడితే ..
ఎవరు గెలిచినా .. ఓడేది మనమే..

మృగాల గెలిచి.. యుగాలు దాటి.. ముందుకు సాగిన మనిషే..
మతాల చిచ్చులో.. స్వజాతి భవిత ను సజీవ దహనం చేస్తుంటే..

తరాలు పంచిన అపార జ్ఞానం.. జనాల చంపే ఆయుధమవుతుంటే..
వనాలు వదిలిన మృగాల రీతి.. సమాజ శాంతికి సమాధి కడుతుంటే..

శ్రుతి మించిన మతోన్మాదం .. వినాశనానికి పునాది కాదా..
గతి తప్పిన ప్రజా పథం .. ప్రపంచ ప్రగతికి ప్రమాదమవదా.

Sunday, May 2, 2010

వెన్నెల

-----

వెన్నెలా .. వెన్నెలా.. ఉందిలే వింతగా.. చూస్తే నిన్నిలా
మొన్నలా.. నిన్నలా .. ఎప్పుడూ చల్లగా.. ఉండటమెలా
కోపమే రాదు నీకెప్పుడు.. తాపమే ఉండదు నీకేన్నడు

నింగి వాకిట్లో.. చిమ్మ చీకట్లో
తల్లి జాబిలి.. కొంగు చాటుగా..
పాల బుగ్గల.. పాప నవ్వులా

పాల సంద్రపు.. లేత నురుగులా..
ఉంది ఈ వెన్నెల..నడి రాతిరేళ

బ్రహ్మ సృష్టి లో .. నిండుతనం
అమ్మ ప్రేమలో.. చల్లదనం
నిండు వెన్నెలకు.. నిర్వచనం

Sunday, April 18, 2010

ప్రస్థానం

--------------

Inspired by Prasthanam movie


నెత్తుటి ముద్దగ మొదలయ్యే.. మానవ ప్రస్థానం
ఆఖరి చితిలో కాలే వరకు ఆరని నిప్పు కణం
మనసుకి మనిషి కి మద్యన ఆగని సంగ్రామం
నీతో నువ్వే నిత్యం జరిపే వింత కురుక్షేత్రం

మరుగుతున్న ఆవేశం హాలాహలం
మరులు గొలుపు ఆశేమో అమృతం
గమనిస్తే రెండిటికీ ఒకటే జన్మస్థలం
బ్రతుకంటే ఈ తెరల మాటు నాటకం
వేషం మారినా మారదు రంగ స్థలం

తప్పులు చేసే మనిషి గుణం..తప్పని చూపే మంచి తనం
మార లేక మాన లేక మదన పడే మనసు వ్యదే
మంచికి, చెడుకి, మధ్యన నలిగే యుగాల మనిషి కధ

Tuesday, March 30, 2010

ప్రేమ

------------------




అడిగితే వచ్చేనా.. ఆమని సొగసులు
బదులుగా అడిగేనా.. కోయిల పలుకులు

అడగక వరమై .. ఆమని స్వరమై
మనసును మీటే రాగం ప్రేమ

కలల జాలము కరిగి పోయే రేయికి.. రవి మేలుకొలుపే ప్రేమ
పగటి బాటలో పరుగు తీసే మనసుకి .. శ శి.. జోల పాటే ప్రేమ

మరిగే ఇలపై .. వేసవి పిలుపై
కురిసే తొలకరి జల్లే ప్రేమ

తీరం వడి లో చేరే ఓ నిమిషం కోసం ..సాగర దూరం సాగే అల ఆరాటం కాదా ప్రేమ
చేరువ అయ్యే ఈ బంధం క్షణ కాలం అని తెలిసీ.. జేవిత కాలం వేచే తీరం ఆశే ప్రేమ

Thursday, March 25, 2010

సీతా రాముల కళ్యాణం

.................



ఏ యుగముల తపముల ఫలమో , మిథిల కు కలిగిన భాగ్యం
తను వేదిక కాగ, జరిగెను సీతారాముల కళ్యాణం

అవని కన్న వనిత, ఆది లక్ష్మి అని తెలిసి
కోరి వచ్చిన వరుడు, శ్రీ హరే నని మురిసి
పొంగి మనసున, తొంగి చూసెను ఆకశం
రంగు రంగుల రంగవల్లుల, మెరిసెను భూతలం

రత్నగర్భ యె తల్లి ఈ వధువుకి
వరుడు సిరుల రాణి కి పెనిమిటి
నగలు వెల వెల బోయే .. సువర్ణ వర్ణ సీత మేనిపై
రాముని ఒడలే వెలుగులీనే, భువి కి దిగిన రవి యై

మనువు కి అర్థం తెలుపుతు... మునుపెరుగని రీతి
మునులు.. సురలు.. భూవిభుల నడుమ జరుగు ఈ పెళ్లి
మిథిల కు కలిగిన ఈ భాగ్యం రాబోదు ఎవ్వర కీ . ఎప్పటికీ

Tuesday, March 9, 2010

కల్యాణం

------



మరల రానిది ఈ క్షణం.. మరువలేనిదీ కల్యాణం
తర తరాల సంగమం .. తరలి వచ్చిన బంధు జనం
చూసిన కళ్ళదే సౌభాగ్యం .. ఊహల కందని వైభోగం

మన్మధుడే మానవుడై, మా వరుడై ఈ గతిని
పెళ్ళాడే పందిట్లో సందట్లో వదువైన ఆ రతిని

కలిసిన మనుషుల .. మురిసిన మనసులు
చిలిపిగ జల్లిన వసంతాలు..ముత్యాల తలంబ్రాలు

మంగళ కరమౌ మాంగల్యం ..నవ బాంధవ్యానికి ఆరంభం
మంత్రాలు సన్నాయి.. పంపించగ ఆహ్వానం
బంధువులై రావాలి .. దేవతలే ఈ దినం

కష్టాలు.. ఇష్టాలు .. కలిమి లేమి లు కలగలిపి నూరేళ్ళు
ఏ నాడు.. నీ తోడు.. వీడకని తెలిపినవి ఏడడుగులు

అక్షతలే దీవేనలై , దీవించగా దేవతలే
వెలగాలి కల కాలం .. దాంపత్యం శ్రీ కరమై

Thursday, February 4, 2010

సంధ్యా సమయం

-----

అలుపు తీరగ పసిడి బానుడు
అలల కౌగిలి జాలు వారే....

వగలు మారి చందమామ
గగన సీమను కొలువు తీరే..

కలల రేడు చూపు తాకి
కలువ మేను పులకరించే..

పరిమళాల సన్న జాజి,
చల్లనైన సందె గాలి,
పంపు తున్నవి ఆహ్వానం..

మరో అందమైన రాత్రికి
ఈ సంధ్యా సమయం