Tuesday, March 30, 2010

ప్రేమ

------------------




అడిగితే వచ్చేనా.. ఆమని సొగసులు
బదులుగా అడిగేనా.. కోయిల పలుకులు

అడగక వరమై .. ఆమని స్వరమై
మనసును మీటే రాగం ప్రేమ

కలల జాలము కరిగి పోయే రేయికి.. రవి మేలుకొలుపే ప్రేమ
పగటి బాటలో పరుగు తీసే మనసుకి .. శ శి.. జోల పాటే ప్రేమ

మరిగే ఇలపై .. వేసవి పిలుపై
కురిసే తొలకరి జల్లే ప్రేమ

తీరం వడి లో చేరే ఓ నిమిషం కోసం ..సాగర దూరం సాగే అల ఆరాటం కాదా ప్రేమ
చేరువ అయ్యే ఈ బంధం క్షణ కాలం అని తెలిసీ.. జేవిత కాలం వేచే తీరం ఆశే ప్రేమ

Thursday, March 25, 2010

సీతా రాముల కళ్యాణం

.................



ఏ యుగముల తపముల ఫలమో , మిథిల కు కలిగిన భాగ్యం
తను వేదిక కాగ, జరిగెను సీతారాముల కళ్యాణం

అవని కన్న వనిత, ఆది లక్ష్మి అని తెలిసి
కోరి వచ్చిన వరుడు, శ్రీ హరే నని మురిసి
పొంగి మనసున, తొంగి చూసెను ఆకశం
రంగు రంగుల రంగవల్లుల, మెరిసెను భూతలం

రత్నగర్భ యె తల్లి ఈ వధువుకి
వరుడు సిరుల రాణి కి పెనిమిటి
నగలు వెల వెల బోయే .. సువర్ణ వర్ణ సీత మేనిపై
రాముని ఒడలే వెలుగులీనే, భువి కి దిగిన రవి యై

మనువు కి అర్థం తెలుపుతు... మునుపెరుగని రీతి
మునులు.. సురలు.. భూవిభుల నడుమ జరుగు ఈ పెళ్లి
మిథిల కు కలిగిన ఈ భాగ్యం రాబోదు ఎవ్వర కీ . ఎప్పటికీ

Tuesday, March 9, 2010

కల్యాణం

------



మరల రానిది ఈ క్షణం.. మరువలేనిదీ కల్యాణం
తర తరాల సంగమం .. తరలి వచ్చిన బంధు జనం
చూసిన కళ్ళదే సౌభాగ్యం .. ఊహల కందని వైభోగం

మన్మధుడే మానవుడై, మా వరుడై ఈ గతిని
పెళ్ళాడే పందిట్లో సందట్లో వదువైన ఆ రతిని

కలిసిన మనుషుల .. మురిసిన మనసులు
చిలిపిగ జల్లిన వసంతాలు..ముత్యాల తలంబ్రాలు

మంగళ కరమౌ మాంగల్యం ..నవ బాంధవ్యానికి ఆరంభం
మంత్రాలు సన్నాయి.. పంపించగ ఆహ్వానం
బంధువులై రావాలి .. దేవతలే ఈ దినం

కష్టాలు.. ఇష్టాలు .. కలిమి లేమి లు కలగలిపి నూరేళ్ళు
ఏ నాడు.. నీ తోడు.. వీడకని తెలిపినవి ఏడడుగులు

అక్షతలే దీవేనలై , దీవించగా దేవతలే
వెలగాలి కల కాలం .. దాంపత్యం శ్రీ కరమై